సమరయ స్త్రీ
ఒకసారి యేసుక్రీస్తు సమరయ ప్రాంతంలోని సుకారను ఊరికి వచ్చాడు. ఆయన వెంబడి ఆయన శిష్యులు కూడ వున్నారు. సమయం మధ్యాహ్నం అయింది. యేసు అలసిపోయి ఒక బావి గట్టున కూర్చున్నాడు. ఆ బావికి “యాకోబు బావి" అని పేరు. అప్పుడొక సమరయ స్త్రీ నీళ్లకోసం ఒక కుండతో అక్కడికి వచ్చింది. అప్పుడు యేసు శిష్యులు ఆహారం కోసం ఊరిలోకి వెళ్లారు. సమరయ బావి దగ్గరికి రాగానే యేసు ఆమెతో దాహమునకు నీళ్ళు యివ్వమని అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే యూదులు సమరయ్యులతో సాంగత్యం చేయరు. సమరయులను చాల నీచంగా చూస్తారు. వాళ్ళ యిండ్లలో భోజనం చేయరు. వాళ్లుండే వీధుల్లో నడవరు. వాళ్లు ఇచ్చిన నీళ్ళు త్రాగరు. వాళ్ళతో బంధుత్వం చేయరు. మాట్లాడటానికి కూడ యిష్టపడరు. వాళ్లు దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు "దేవా! మమ్మల్ని కుక్కలుగాను, సమరయులుగాను పుట్టించనందుకు ధన్యవాదములు" అని ప్రార్థిస్తుంటారు. సమరయ స్త్రీకి యేసు ప్రభువుకు మధ్య సంభాషణ యిలా కొనసాగింది.
సమరయ స్త్రీ : అయ్యా ! యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు నీళ్ళివ్వమని ఎలా అడుగుతున్నావు?
యేసుక్రీస్తు : నిన్ను దాహమిమ్మని అడుగుతున్న వ్యక్తి ఎవరో తెలిస్తే నీవే ఆయనను అడుగుతావు. ఆయన నీకు జీవజలము యివ్వగలిగిన సర్వశక్తిమంతుడు.
సమరయ స్త్రీ : అయ్యా! ఈ బావి చాల లోతైనది. నీళ్ళు తోడుకొనడానికి నీ దగ్గర బొక్కెన, తాడు వంటి సాధనాలు లేవు. ఈ బావిని త్రవ్వించి, తాను, తన కుమారులు, సేవకులు, పశువులు, పక్షులతో సహా ఈ బావినీళ్లు తాగిన మన తండ్రియైన యాకోబు కంటె నీవు గొప్పవాడివా?
యేసుక్రీస్తు : ఈ నీళ్ళు తాగే వాడు మరల దప్పిక గొంటాడు. కాని నేనిచ్చు నీళ్ళు తాగేవాడు ఎన్నటికి దప్పిక గొనడు. నేను వానికిచ్చేనీళ్ళు వానిలో ఊరేడి నీటిబుగ్గ వలె వుంటాయి.
(నా మాటలు జీవ జలపు ఊటలు. వాటిని స్వీకరించే వాడు నిత్య సంతోషాన్ని, నిత్య జీవాన్ని పొందుతాడు. యిహలోక సంబంధమైన ఆకలి దప్పులను లెక్క చేయడు).
సమరయ స్త్రీ : అయ్యా! నేను యికముందు దప్పిగొన కుండునట్లు, చేదుకొనడానికి యింతదూరం రాకుండా వుండునట్లు ఆ నీళ్ళు నాకు దయచేస్తే నేను చాల సంతోషిస్తాను. నీకు కృతజ్ఞురాలినై వుంటాను.
యేసుక్రీస్తు : అయితే నీవు వెళ్ళి నీ భర్తను పిలుచుకొనిరా.
సమరయ స్త్రీ : నాకు భర్త లేడు.
యేసుక్రీస్తు : నీవు నిజమే చెప్తున్నావు. నీకు ఒకప్పుడు అయిదుగురు భర్తలు వున్నారు. యిప్పుడున్నవాడు కూడ నీ భర్త కాడు.
సమరయ స్త్రీ : అయ్యా! నీవొక ప్రవక్తవని గ్రహించుచున్నాను.మా పితరులందరు యిక్కడే దేవుణ్ణి పూజించి ఆరాధించారు. కాని నిజంగా ఆరాధించవలసిన పవిత్ర స్థలం యెరూషలేములో వుందని మీరు (యూదులు) చెప్తుంటారు.
యేసుక్రీస్తు : అమ్మా! నీవు విన్నది నిజమే. కాని, నేను చెప్పేమాట నమ్ము. ఒక సమయం రాబోతుంది. అప్పుడు యిక్కడ గాని, యెరూషలేములోగాని ప్రజలు దేవుని ఆరాధింపరు. మీరు తెలియని దానిని గ్రుడ్డిగా ఆరాధించేవారు. మేము మాకు తెలిసిన దానిని, మేము నమ్మిన దానిని, ధర్మశాస్త్రములో చెప్పిన దానిని ఆరాధించే వాళ్ళము. “రక్షణ యూదులలో
నుండి కలుగును" అనే వాక్యము నమ్మదగినది. అయితే,యదార్ధముగా ఆరాధించేవాళ్ళు ఆత్మతోను
సత్యముతోను ఆరాధించే కాలము వచ్చుచున్నది. అది
యిప్పుడు వచ్చియే వున్నది. తనను ఆరాధించి, ప్రార్థించే వారంతా ఆత్మతోను, సత్యముతోను, ఆరాధించాలని తండ్రియైన దేవుడు కోరుచున్నాడు. "దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను.
సమరయ స్త్రీ : అయ్యా! నీ మాటలు నాకేమీ అర్ధం కావడంలేదు. అయితే క్రీస్తు అనబడిన "మెస్సీయ" శరీరధారిగా వస్తాడనీ, ఆయన పరలోక మర్మాలన్నీ మాకు తెలియజేస్తాడనీ, మా పెద్దలు చెప్తుంటారు.వారి మాటలు నేను నమ్ముతున్నాను నీతో మాట్లాడుతున్న నేనే ఆ మెస్సీయాను అంతలో యేసు శిష్యులు అక్కడికి వచ్చారు. ఆయన ఒక స్త్రీతో మాట్లాడుతుండటం చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావని గాని, ఏమి మాట్లాడుతున్నావని గాని ఎవరూ అడగలేదు.
యేసుతో మాట్లాడిన కొద్ది నిమిషాలలోనే సమరయ స్త్రీకి తన వాస్తవ పరిస్థితి తెలిసిపోయింది. ఆమె హృదయంలో కలవర పడింది. తానింత వరకు
గడిపిన జీవితం మంచిది కాదని గ్రహించింది. ఆమె మనసంతా వేదనతో, పశ్చాత్తాపంతో నిండిపోయింది.
ఆమె నీళ్ళ కోసం తెచ్చిన కుండను అక్కడే వదిలిపెట్టి త్వరత్వరగా ఊరిలోకి వెళ్ళింది. అందర్నీ పిలిచింది. బావి దగ్గర జరిగిన విషయమంతా చెప్పింది. "మీరు వచ్చి, నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన మనుష్యుని ఒక్కసారి చూడండి. ఈయన క్రీస్తు కాడా!" అని చెప్పింది. ఆ ఊరి ప్రజలందరూ యేసును చూడటానికి బయలు దేరారు.
యేసు శిష్యులు ఆయనను భోజనం చేయమని అడిగారు. అందుకాయన “మీకు తెలియని ఆహారం నాకు వుంది” అని చెప్పాడు. అందుకు శిష్యులు ఈయన దగ్గర ఎవరైనా తెచ్చిన ఆహారం వుందేమో?
అని తమలో తాము అనుకొన్నారు. యేసు వాళ్ళ ఆలోచన గ్రహించి యిలా అన్నాడు. - "నన్ను పంపినవాని (దేవుని) చిత్తము నెరవేర్చుట, ఆయన చెప్పిన పని చేసి ముగించుట అనునవే నాకు ఆహారము. పొలంలో విత్తనములు వేసిన
నాలుగు నెలలకు పంట కోతకు వస్తుందని మీరు చెప్తుంటారు. యిప్పుడు లోకం పరిస్థితి అలాగే వుంది. మీ కన్నులెత్తి పొలాలు చూడండి. అవి యిప్పుడే
తెల్లబారి కోతకు వచ్చియున్నవి. మనుషులంతా కోతకు సిద్ధమైన పంటపొలాల వలె వున్నారు. వారికి రక్షణ మార్గాన్ని బోధించుటకు తగిన సమయమిదే.
సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యమును బట్టి ఆ వూరిలోని సమరయులలో చాల మంది యేసు క్రీస్తునందు విశ్వాసముంచారు. వాళ్లు తమ వద్ద వుండమని
కోరినందున యేసు ఆ గ్రామంలో రెండు రోజులున్నాడు. యేసుక్రీస్తు మాటలు వినిన చాల మంది గ్రామస్థులు యేసును విశ్వసించారు. వాళ్లు సమరయ స్త్రీతో - "యిక ముందు నీవు చెప్పిన మాటలను బట్టి మేము యేసును నమ్మడం లేదు. మేము స్వయంగా ఆయనను చూసి, ఆయన బోధలు వినినందున ఆయన లోకరక్షకడు అనీ, మెస్సీయా అనీ, నమ్ముతున్నాము" అని చెప్పారు. ఈ విధంగా ఒక సమరయ స్త్రీ ద్వారా సుకారను గ్రామంలోని వారందరు యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించారు.
సమరయ స్త్రీ మొదట తన అందం, డబ్బు, సంపద, యితర లౌకిక విషయాలను చూసికొని అతిశయపడుతుండేది. అయితే యేసుతో మాట్లాడిన
తర్వాత ఆమెకు తన యదార్ధస్థితి తెలిసిపోయింది. తానెంత హీన పరిస్థితిలోవుందో గ్రహించింది. ఆమె మనసు మారింది. మాట మారింది. జీవితమే
మారిపోయింది. ఆమెకు తానింత వరకు గడిపిన నిరర్ధక జీవితం కండ్ల ఎదుట నిలిచింది. యేసు క్రీస్తు ఆమెకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకే
ఆమె పరుగున వెళ్ళి గ్రామస్థులందరికి యేసును గురించి చాటి చెప్పింది. మొదట ఆమె మాటలు విని యేసును నమ్మారు. తర్వాత గ్రామస్థులు యేసు
బోధలు విని ఆయన లోక రక్షకుడని తెలిసికొన్నారు.
సమరయ స్త్రీ యేసును మొదట ఒక యూదుడు అనుకొన్నది. తర్వాత ఒక ప్రవక్త అనుకొంది. తర్వాత ఆయన క్రీస్తనబడిన యెస్సీయ అని ఊహించింది. చివరకు క్రీస్తు అని చెప్పింది. యేసుతో సంభాషణ చేసిన కొలది ఆమె అభిప్రాయాలు మారుతూ వచ్చాయి.
Any Bible story you want comment below...
0 Comments